సాకలి రెడ్డెన్న సరదా – ఇది నా మొదటి టపా

తెలుగు బ్లాగ్లోకానికి ప్రణామములు. ఈ మద్య చాన్నాళ్లనుంచి నాకు ఏదో బ్లాగాలని మనసు ఉబలాటం ఎక్కువై ఏమి బ్లాగాలొ ఎలా బ్లాగాలొ తెలియక చివరాఖరికి ఈ టపా రాశాను.

కోటకాడ పల్లి చిత్తూరు జిల్లా, యర్రావారి పాలెం మండలం దాటుకొని,  తలకోనకు అడ్డం గా కాకుండా నిలువుగా పోతే వస్తుంది. అదేనండి మా ఊరు. రెండు కి.మి దూరం లొ అడవి ఇంకొ కి.మి. అడుగులేస్తే,  అందమైన సిద్దలగండి రిజర్వాయర్, దాని కింద పండే పచ్చని పొలాలు, వాటికిటువైపు ఉండే పాడాంచెరువు, అందులొ సాకిరేవు, చెరువు మొరవ, మొరవ లొ సంక్రాంతి కి జరిగే సంబరాలు,  ఆవులు బెదిరించే ఘట్టం. అబ్బో ఒకటి కాదండి బాబు సెపితే శానా ఉండాయ్.

ఊరంటే ఉరు కాదండి బాబు, అక్కడ జరిగే సిత్రాలు అన్నీ ఇన్నీ కావు,  సెపితే శానా ………..  కాని కొన్ని, కొన్నే సెప్తా అన్నీ ఇప్పుడే సెప్పితే పోను పోను నా బ్లాగులొ బ్లాగడానికి ఏమి ఉండదు కదా ….ఈ రోజు సాకలి (చాకలి, రజకులు) రెడ్డెన్న సరదా… గురించి సెప్తా..

సాకలి రెడ్డెన్న అంటే మా ఊరోడు కాదు, పక్కూరు, చెంగాడి వాండ్ల పల్లె. మా ఊర్లో చాకలోల్లు, మంగళోల్లు ఇంకా మిగిలిన ఆ రెండూ కులపోల్లు ఉండకూడదంట. ఇది మా ఊర్లొ స్వాతంత్ర్యం రాకముందు నుండి ఉంది.  ఇప్పటికి అట్లే ఉంది.  ఇదో కట్టుబాటు.  ఇప్పటికీ మా ఊర్లొ తగాదాలు,  కొట్లాటలొచ్చినా పులగూరోల్ల రవణ ఇంట్లో పంచాయితీ పెట్టాల్సిందే కాని,  మా ఊరికి ఓ పోలీసోడు కూడా రాడు.
మా ఊరే కాదు చుట్టు పక్కల నాలుగైదు ఊళ్లకి ఆయనే పెద్ద.  అస్సలు ఈ సాకాలోల్ల రెడ్డెన్న ఏంజేశాడంటే,  పులగూరోల్ల రవణ బయటూర్లో పంచాయితీకి పోవడానికి తెస్తానన్న పంచా,  చొక్కా ఇంకా ఉతికి ఇస్త్రీ చేసి తేకుండా రంగన్నా గారి గడ్డలో ఉన్న కూతురింటికి రాజకీయనాయకుడులా తయారయ్యి తిరుగురొడ్డు కాడ బస్సు కోసం కళావతి కొట్లో తాపీగా కాపీ తాగుతూ కూర్చున్నాడు.

పొద్దున్నుండీ చూసిన పులగూరోల్ల రవణ ఇక ఈ రెడ్డిగాడు రాడు అని పక్కింట్లొ ఉన్న బోడిగ్గారి యంకట్రాం కొడుకు జనార్దన్ను సాకలోల్ల రెడ్డెన్న ఇంటికెల్లి పంచ, చొక్క తెమ్మని పురమాయించాడు. ఇందుకోసం తిరుగు రోడ్డు మీదుగా పక్కూరికెలుతున్న జనార్దన కళావతి కొట్లో కాపీ తాగుతున్నా సాకలొళ్ల రెడ్డెన్నను చూసి, “ఒరెయ్ రెడ్డిగా పులగూరోల్లాయన అయ్యగారిపల్లొ మద్దిస్తం (పంచాయితీ) ఉందని నీకు గుడ్డలు తెమ్మని చెప్పినాడంట కదా ఇక్కడ కూర్చుని జమైకాలాడుతున్నవేందీ”? అని రాగం తీసి యాలకోళంగా అడగ్గా, పక్కనున్నోళ్ల దగ్గర పౌరుషం చూపిస్తూ, అవే గుడ్డలు కట్టుకొన్న సాకలొల్ల రెడ్డెన్న “లేదు నేను నా రెండో కూతురు మూడోసారి నీళ్లోసుకుంటోంది,  రంగన్నగారి గడ్డకి పోతాండా, ఈ రోజు ఉద్దోగం,  గిద్దోగం లేదు,  మొన్న తెచ్చిన గుడ్డలు ఇంకా సాకిరేవుకు పోలేదు ఈ రోజుటికి ఏదైనా వేసుకొమ్మనిచెప్పు పొ”  అని బెంచి మీదున్న దుప్పటి లాంటి తుండు గుడ్డని భుజమ్మీదేసుకొని అప్పుడే మలుపు తిప్పుకొని ఆగుతున్న ఏడుసింగల్ బస్సెక్కి చక్కగా పోయాడు.
సాకలి రెడ్డెన్న కోసం వచ్చిన జనార్దన బాట గంగమ్మ కాడ మాడితోపులొ దూరి నేరుగా పులగూరోల్ల రవణ ఇ ంటికెల్లి సాకలి రెడ్డెన్న విషయం చెవిలొ వేసి వరి మళ్లొ నాట్లేయాలని,  చూరుకిందున్న మడక భుజానేసుకొనిపోయాడు. ఇక చేసేదేమి లేక నిన్న పీర్ల పండగ చందాల్లొ మిగిలించుకున్న డబ్బుతొ కొన్న సిల్క్ చొక్కా, మొన్న శ్రీరామ నవమి  తగాద తీర్చడం లొ చిరిగి పోయిన చిన్నంచు పెద్ద పంచెను నడ్డికి చుట్టుకొని గడ్డం దీడుకుంటూ మద్దిస్తానికి పోయాడు పులగూరోల్ల రవణ.
బిడ్డల్లేని వడ్డోళ్ల చిన్నబ్బ,  శివరాత్రికని కొనుక్కొన్న సిల్క్ చొక్కా, జరీ పంచా దీపాలు పెట్టక ముందే తెస్తానన్న సాకలోల్ల రెడ్డెన్న రాకపోయేసరికి తెచ్చుకుందామని చెంగాడి వాండ్ల పల్లె కు చారల చెడ్డితోనె బయలుదేరాడు వడ్డోళ్ల చిన్నబ్బ. మూడేళ్లు  వరసగా శివరాత్రికి తలకోన లొ తలనీలాలు ఇచ్చుకుంటే పండంటి మగ బిడ్డ పుడుతాడని పూజారి సిద్దయ్య సలహా మీద రెండేళ్లు పూర్తి చేసాడు వడ్డోళ్ల చిన్నబ్బ. రాయాల్సిన ప్రోగ్రాం నెట్ లొ దొరికినట్టు ఏడు సింగల్ బస్సు లొ తిరుగురోడ్డు కాడ దిగిన సాకలోల్ల రెడ్డెన్న వడ్డోళ్ల చిన్నబ్బ కు ఎదురు పడ్డాడు. “సందేల దీపాలు పెట్టక ముందే వస్తానన్నోడివి ఏమైపొయావ్ ర రెడ్డిగా”? అని అడగ్గా రెండో కూతురు మూడోసారి నీళ్లొసుకొన్న సంగతి చల్లగా చెప్పి,  తెళ్లారే లోపల మీ ఇంటికాడుంటాయని ప్రమాణం చేసినంత పనిచేసి గండం నుండి బయట పడ్డాడు సాకలోల్ల రెడ్డెన్న.
ఇలానే కొక్కారపు సుబ్రమణ్యం సర్పంచి ఎలెక్షన్ లొ వార్డ్ మెంబర్ గా నిలబడ్డపుడు తెస్తానన్న కద్దరు చొక్కా, ముందు రోజేస్కొని తిరపతెల్లి సమరసిమ్హా రెడ్డి సినిమా మార్నింగ్ షొ మాట్నీ చూసుకొని రాత్రికి రాత్రే ఉతికి ఇస్త్రీ నలక్కుండా ఇచ్చేవాడు సాకలోల్ల రెడ్డెన్న.
మా ఊర్లో ఎవరు కొత్త బట్టలు కొన్న రెండోసారి మాత్రం అది కచ్చితంగా సాకలి రెడ్డెన్న వేసుకోకుండా వదిలేవాడు కాడు. అతని బట్టలు ఎపుడూ నలిగేవి కాదు. అలాగే అతని పనితనం కూడా చాల బావుండేది. అతను చేసిన ఇస్త్రీ కట్టుకున్నా పోయేది కాదు, అంటుకున్న మరక వెతికినా దొరికేది కాదు. ఊర్లో అందరికీ ఈ విషయం తెలియక అలానె ఉన్నారో,  లేక తెలిసీ తెలీనట్టున్నారో,  ఓ పట్టాన అర్థం కాదు

మొత్తమ్మీద నాకర్థం అయిందేంటంటే చాకలొల్ల బట్ట మంగళోల్ల గడ్డం ఎప్పుడూ మాసిపోవు అని.

కొత్త సినిమాలు వచ్చినా, వారపు సంతలు,  జాతరలు వచ్చినా మన రెడ్డెన్నకుండే సరదాయే వేరు. ఇలాంటి పాత్రలు మా ఊళ్లో చాలా ఉన్నాయ్. నా బ్లాగడం బావుందనిపిస్తే మరికొన్ని పరిచయం చేస్తా. …అంతవరకు సెలవ్…చిత్తగించవలెను
ఇక్కడ నాకో సందేహం వచ్చిందండోయ్ ఇపుడు మనమేసుకొంటున్న రెడీమేడు బట్టలు ఇలాంటి వారిని చూసే అందరికీ సరిపొయే కొలతలతో కుడుతున్నారని…ఏమంటారు?
 

Published in: on 29/10/2007 at 7:09 PM  Comments (8)