మతానికి మూలాధారం ఉందా?

           మతమన్నది భక్తివిశ్వసాల పై ఆధారపడి ఉంటుందని అంటన్నారు. దీనితో పాటు అనేక సందర్భాల్లో మతమన్నది కేవలం వివిధ సిద్ధంతాల సంపుటి గా ఉంది.మతాలన్నింటిలొ అంతఃకలహాలు ఉండటానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు.

ఈ సిద్దాంతాలు తిరిగి విశ్వాసం పై ఆధారపడి ఉంటాయి.  ఆంతరిక్షం లొ ఎక్కడో కూర్చొని, బ్రహ్మండాలన్నింటిని పాలించే వ్యక్తి ఉన్నాడని చెబుతాడు.  తానలా రూడీగా చెప్పడమే ఆగమప్రమాణంగా అంగీకరించి, తనమాటలు నమ్మాలా? లేక కొందరికి వెరే అభిప్రాయాలుంటాయి.  వాటిని ఇతరులు నమ్మాలి అంటారు.  ఎందుకు నమ్మాలి అని వారిని అడిగితే కారణం చెప్పలేరు.

కాబట్టి ఈ రొజుల్లో మతమన్నా, వేదాంతమన్నా దురభిప్రాయం కలుగుతున్నది.  “ఓహో, ప్రతి వ్యక్తి తనకు నచ్చిన ఊహలను భోధిస్తున్నాడు.  వాటి మంచి చెడులని నిర్ణయించడానికి ఒక ప్రమాణం అంటూ లేదు. ఈ మతాలన్ని వట్టి సిద్దాంతాల కట్టలు”  అని విద్యాధికుల అభిప్రాయం.

ఐనా, భిన్న దేశాళ్లో, భిన్న మతస్తుల, భిన్న అభిప్రాయాలే కాక, భిన్న సిద్దాంతాలునూ సమన్వయం చేస్తూ, ఆస్తికతకు సర్వజనసామన్యమైన మూలాధారమొకటుంటుంది.  మూలానికి వెళ్లి చూస్తే, అవి కూడా, సర్వజనసామాన్యనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు.  ప్రపంచం లో ఉన్న వివిధ మతాలన్నింటిని విభజించి చూస్తే, ఆగమ ప్రామాణ్యం లేదా గ్రంథ ప్రామాణ్యం గలవి లేనివి అని రెండు రకాలుగా ఉన్నట్లు తోస్తుంది.  గ్రంథ ప్రామాణ్యం ఉన్న మతాలు ప్రబలాలవ్వటం వల్ల, చాల మంది వాటిని అవలంబిస్తున్నారు.   ఆ ప్రామాణ్యం లేనివి చాలా వరకు నశించాయి.  ఇక క్రొత్తగా వెలసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాల తక్కువగా ఉన్నారు.

ఐతే, ఈ మతాలు భొధించే తత్వాలన్ని ప్రత్యేక వ్యక్తుల అనుభవ పలితాలన్న విషయం లో ఈ మతాలన్ని ఏకీభవిస్తున్నట్టు కాన వస్తాయి.  తనమతాన్ని నమ్మమని క్రైస్తవుడు చెబుతాడు, అతని మాటలు విని క్రీస్తులో క్రీస్తు అవతారం లో దేవుని లో జీవుని లో జీవుని భవిస్యత్ ఉత్తమస్తితి లో విశ్వాసం పూనాలంటాడు.   కారణమేమిటి అని ఆడిగితే,  అది తన నమ్మకం అంటాడు కాని,క్రైస్తవ మతానికెళ్లి చూస్తే, అనుభూతి దానికాధారం అని గ్రహిస్తారు.  క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు.  అతని శిష్యులు తాము భవంతుని అనుభూతిని పొందామని చెప్పారు.

ఇలాగే బౌద్ద మతంలొ కూడా బుద్దుని అనుభూతే ప్రధానంగా ఉంది.  బుద్దుడు కొన్ని సత్యాలను అత్మానుభూతి వల్ల గ్రహించాడు.  వాటిని నవలోకించాడు.  వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్వదర్శియై లోకానికి తత్వోపదేశం గావించాడు.

హిందువుల విషయం ఇలాంటిదే.  స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చాటుతూ, తాము కన్న తత్వాలనే లోకానికి భొధిస్తున్నారు.

జ్ఞానికంతా ప్రత్యక్షానిభూతే పునాది.  ప్రపంచ మతాలన్నింటికి త్రికాలాబాదిత ప్రత్యక్షానుభూతే మూలాధారమై స్పస్ఠమౌతోంది.  మత ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే.  ఆత్మదృష్టులై, త్రికాలజ్ఞులై తమ శశ్వతతత్వాన్ని దర్శించి తాము కన్నదాన్ని వారు లోకానికి భొధించారు.

ఈ అనుభూతులు నేడు అసాద్యాలని, మొదట మతాలు స్థాపించిన ఏ కొంతమందికో అవి సాద్యమయ్యాయని ఇప్పటి వాదన.  ఈ రోజుల్లో ఆ అనుభూతులు చల్లవట!  అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏది లేదట!

Published in: on 09/05/2009 at 8:42 AM  Comments (5)  

ఉగాది శుభాకాంక్షలు

 

 

బోసి నవ్వుల బుడ్దోడి కిల కిలలు,

చిన్నారి చిన్ని కాళ్ల గజ్జెల గలగలలు,

అక్క చెల్లెళ్ల పట్టు పరికిణి ఓణి రెప రెపలు,

మల్లెల పరిమళం గుబాళింపుల మద్య,

 

మంచి (నువ్వుల) నూనె తో తలంటుకొని,

కొత్త బట్టలు కట్టుకొని,

ఉగాది పచ్చడి ఆరగించి.

 

అమ్మ చేతి ముద్ద పప్పు,అన్నం తో,

నాణ్యమైన ఆవు నెయ్యి నిబ్బరంగా దట్టించి,

పిండివంటలు కంచం నిండుగా,

మధు మెహన్ని మరుగుకు జరిపి,

బీపీ ని బయటకి నెట్టి,

ఓ పట్టు పట్టి గట్టి గా త్రేంచండి.

ఈ ఉగాది మీ ఇంట సిరి సంపదలు తో వెలగాలని కోరుకుంటూ..

 

-శివకుమార్ దిన్నిపాటి 

Published in: on 27/03/2009 at 12:20 AM  Comments (5)  

నమ్మకాలు

నమ్మకాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయ్ ఉదాహరణకి కొందరు ప్రతి రోజు చేసే పనులనే పరికించి చూస్తె ఒక్కోసారి విధంగానే ఎందుకు చేయాలి? మరోలా చెయ్యొచ్చు కదా అనిపిస్తూంటది …. మొన్నీమధ్య మాటల్లో నమ్మకాలు (మూడనమ్మకాలు కాదులెండి) గురించి చిన్నపాటి చర్చ జరిగింది. మా మిత్రుడు మధ్య ఆన్ సైట్ మీద దుబాయ్ వచ్చాడు. తను చిన్నప్పటి నుండి చాల నమ్మకాలు పెంచేసేసుకున్నాడట, ఇప్పుడు వదలాలన్న వదళ్లేక పోతున్నానని వాపోయాడు. ఎలాంటివంటే తను పదో తరగతి లో ఉన్నపుడు మొదటి పరీక్ష ఎలా రెడీ అయ్యి, ఎలా వెళ్ళాడో మిగతా అన్ని పరీక్షలకు అలా నే తయారయ్ వెళ్లేవాడట.

ఇక్కడ రెడీ మరియు ఎలా అన్నవి ఒక్కసారి ఎర్ర ఇంకుతో కింద గిర్ర గీసుకోండిఎందుకంటే మొదటి సారి తోలి పరీక్ష చాల బాగా వెళగ పెట్టాడట. అప్పటినుండి రోజు ఎలా లేచాడో, ప్రొద్దున పక్క మీద నుండి అలానే లేవడం, జుట్టు ఎటువైపు కు దువ్వి ఉంటే అటువైపే దువ్వడం, ఒకవేళ శోభన్బాబు రింగు ఉంటే, రింగు పెట్టుకోవడం. ఇంట్లో నుండి బయటకు ఎలా వచ్చాడో అలానే రావడం, వీది సందులో ఎలా మలుపు తిరిగాడో అలానే తిరగడం, అక్కడ మూల గుడి ఉంటే గుడికి వెళ్తూ వెళ్తూ నే దండం పెట్టేయడం .. రెండో రోజో మూడో రోజో అన్నో, నాన్నో పాఠశాల దగ్గర దింపుతామన్నా అవసరం లేదు నేనే వెళతాను ఆలస్యం అయినా పర్లేదుట. ఎవ్వరైనా దింపితే రోజూ చేసేవి చెయ్యలేడు కదా మరి. ఇలా ఒక్కటి కాదండి బాబు చాల చెప్పాడు అవన్నీ చెప్ప్పాలంటే బ్లాగ్ ను మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండరు ……

చివరాఖరికి తన సంశయం ఏమిటంటే ఆన్ సైట్ ప్రాజెక్ట్ మొదటి రోజు ఎలా వచ్చాడో అలా వెళ్లడానికి ఇక్కడ హైదరాబాద్ రోడ్డు అమీర్పేట సందు లేవట (ఓసోస్ నాకు తెలుసు మీరు మొదటి రోజు దుబాయ్ లోనే కదా వెళ్ళేది అంటారు మీరు కాళ్ళో పప్పేసారు సారి పప్పులో కాలేసారు. తనకు ప్రాజెక్ట్ అప్పగించే రోజు హైదరాబాద్ లో ఎలా వెళ్ళాడో అలా… …. వీడి బెంగ దుబాయ్ ట్రాఫిక్ లో తోయ్యా.

Published in: on 22/07/2008 at 5:26 PM  Leave a Comment  
Tags:

అత్యధికులు ఆంధ్రులే

ఈనాడు దిన పత్రిక లో ఈరోజు వార్త

పై వార్తకోసం ఇక్కడ చూడండి

Published in: on 06/11/2007 at 9:42 AM  Leave a Comment  

దూరపు కొండలు నునుపు

దుబాయ్… ఇట్స్ వెరి కూల్ ప్లేస్ విజిటింగ్ కి, ఇది ఇక్కడికి వచ్చిన యాత్రికులు/వ్యాపారస్తులు చెప్పే మాట ఇది ఒక కోణం. (కాని ఇంట్లోనుండి కదిలితే ఎ/సి కార్ లేదా ఆఫీస్ ఈ రెండూ లేకుండా/కాకుండా ఎ/సి లేకుండా విహరిస్తే చెమటలు తొ దూల తీరిపోతుంది అది వేరే విషయం). ఇంకో కోణం ఇక్కడ మండే ఎండలు, పామర జనం అర్రులు చాచి కూటికోసం కడుపు చేతిలొపెట్టుకొని వచ్చి చివరికి ఇక్కడ జైళ్లలొ వారి జీవితాలను మగ్గపెట్టుకుంటున్నారు. నాకెందుకో ఇక్కడికి వచ్చే పని వాళ్లు, అంటే చదువుకోకుండా చేతిపని తెలియని వారిని చూస్తే జాలి, కోపం రెండూ ఒక్కసారిగా కలుగుతాయి. ఇక్కడ చేసే పని మన దేశం లొ చేయడానికి తెగ నామూషీ.  ఇలా ఆలోచించడం తప్పో ఒప్పో కాని. వారు ఉండే ప్రదేశాల స్థితులు, వారి జీవన గతులు చూస్తే కడుపులోని దుఖం తన్నుకరాకమానదు. మన తెలుగువారు ముఖ్యం గా మన తెలంగాణ సోదరులు.

తిండి లేక పస్తులుండేవారు, అద్దె కట్టలేక కార్టూన్స్ తొ గదిలా చేసుకొని జీవించేవారు (ఇక్కడ జీవించే చాలామంది తెలుగువారి ఉపాది పడేసిన కార్టూన్స్ ఏరుకోవడం, తాగి పడేసిన కూల్ డ్రింక్ డబ్బాలు ఏరుకోవడం వాటిని అమ్ముకొని వచ్చినదానితొ తినడం మిగిలితే ఇంటికి డబ్బులు పంపడం. ఇది ఎవరైన లేబర్ అఫైర్స్ కు కంప్లైన్ చేస్తే ఇంకో గూడు కోసం కొత్త నేరాలు.

ఇక ఇక్కడ కంపనీ తరుపున కూలీలు గా వచ్చిన వారికి అన్ని బావుంటాయ్ అనుకుంటే అది అత్యాశే. గొడ్డులా మండుటెండలొ చాకిరి చేయాలి. ప్రొద్దున ఆరింటికే సైట్ లొ ఉంటారు అంటే ఏ నాలుగన్నరకో ఐదుకో నిద్రలేవాలి, బస్సు కోసం పేద్ద క్యు, సాయంత్రం తొందరగా వెళతారంటె గ్యారంటీ లేదు, ఏ 8 కో 9 కో విపరీతమైన ట్రాఫిక్. అప్పుడు వండుకొని తినాలి. నిద్ర ఉండదు. ఇచ్చిన వసతైనా బాగుంటుందా అంటే అదీ చెప్పలేం ఒక్కో గదిలో గొర్రెలను దొడ్లో కుక్కినట్టు ఇరవై, ముప్పై మందినేసి కుక్కుతారు. ఇక్కడ డెబ్బై శాతం కూలీలు తెలుగువారే అని చెప్పొచ్చు. అందులో తెలంగాణ సోదరులు 90% ఉంటారు.

గుండె తరుక్కుపోయె వాళ్ల అమాయికత్వానికోదాహరణ చదవండి…

రెండేళ్ల క్రితం నాకు పెళ్లి కాక ముందు ఒక తెలుగు అతనితో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉండేవాడిని, అతనిది మన కరీం నగర్. వారి ఊరోళ్లతను ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. తను ఎప్పుడు వచ్చినా చాలా బాధగా కనపడేవాడు. నేను అంత కలుపుగోలు వ్యక్తిని కాదు రెండొసారో మూడొసారొ వచ్చినప్పుడు అడిగాను “ఏంటయ్యా చాలా భాధ గా ఉంటావ్ ఎప్పుడొచ్చినా” అని.

“ఏంలె”

“మరెందుకు అంత డీలా గా ఉన్నావ్, భోజనం చేశావా”?
ఒక్కసారిగా గొల్లుమన్నాడు. అలా ఆప్యాయంగా పలకరించేసరికి.

“అన్నా రెండు రోజులగా పని దొర్కతాలె, అన్నం తిన్లె, ఈనెల అద్దె పైసల్ కట్టలేదని గదిలా ఆళ్లు బయటికి గెంటిండ్రు, గీ అన్నని (మా రూమ్మేట్) అడగడానికి మనసు వస్తలే, ఇప్పటికే రెండు మూడు సార్లు తీస్కొన్నవే ఇంతవరకు ఇవ్వలే.

మా రూమ్మేట్ నాకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తేలేదు (బహుశా తనకు చెప్పడం ఇష్టం లేక కావచ్చు) మిగిలినా లోకాభి రామాయణం మాట్లాడుకునే వాళ్లం కాని ఇలాంటివి కాదు.

“సరే ఈ డబ్బు తీసుకో అని అంటూనే, నేను కూడా వస్తాను పద వెళదాం హోటల్ కు అని ఆఫీస్ నుండి వచ్చిన వాడిని అలా అపార్ట్మెంట్ కిందనే ఉన్న రెస్టారెంట్ కు తీసుకెళ్లి భోజనం పెట్టించి మళ్లి గదికి వచ్చాము.

“పని దొరక్కపోవడమేమిటి, మీ కంపెనీ లో పని లేక పంపేశారా?”
“ఊహుం”

“మరి నీకు పతాకా (వొర్క్ పర్మిట్) లేదా?”
“లేదు”

“అంటే నువ్ కంపెనీ వీజా లొ లేవా”
“లేదన్నా, కళ్లి వెళ్లి” (అంటే విజిట్/టూరిస్ట్ వీజా లొ వచ్చి ఇక్కడే ఉండిపోవడం, అలాంటివాళ్లని కళ్లి వెళ్లి అంటారు)

“నీకు ముందు తెలిసే డబ్బులు ఇచ్చావా ఏజెంట్ కి?”
“అవ్ అన్నా” ఇక్కడ నాకు అర్థం కాలేదు మళ్లి అడిగాను.

“ముందు తెలిసే డబ్బులు ఇచ్చావా ఏజెంట్ కి?”
“అవ్ అన్నా, పోరగళ్లు అందరం అలానే ఇచ్చినం”

“ముందే చెప్పారా ఇలా కంపనీ లో పని కాకుండా బయట చేసుకొవడం సొంతంగా అని?”
“లేదన్నా, గవన్నీ మాకేం తెలుసన్నా ఏజెంట్ అజాద్ వీజా అన్నడు. ఏ పనైనా చేసుకొవచ్చు అని”

“మరి పోలీస్ వాళ్లు పట్టుకుంటే?”
“గదంతా ఏం తెల్వదన్నా  ఇక్కడ వచ్చాకే తెలిసింది ఇలా పని చేయడం తప్పు అని”

మొన్నా ఇక్కడ ఆమ్నెస్టీ పెట్టారు అందరూ మినిమం డాక్యుమెంట్స్ తొ దేశం విడిచి వెళ్లొచ్చు అని, కాని వారి దగ్గర వారి పాస్పోర్ట్ కూడా ఉండదు. తినేదానికి డబ్బుల్లేక, ఉండేదానికి చోటులేక ఎంత దుర్భరమైన పరిస్తితుళ్లొ ఉంటారంటే చెప్పడానికి వీళ్లేని స్థితి.

అవును ఇలా ఎందుకు వచ్చావ్, ఎందుకు రావాలనిపించింది అంటే దానికి సమాధానం…

“మా ఊళ్లొ పోరగాళ్లందురూ ఇక్కడున్నరు, వచ్చినప్పుడు ఇక్కడ నుండి వచ్చి మెడలో బంగారం గొళుసు, కళ్లకు అద్దాలు, గుడ్డలకు అత్తర్లు గివన్ని చూపించి ఇక్కడ జీవితం భలేగా ఉంటది అని చెప్పిండ్రు”

ఇక్కడనుండి వెళ్లిన వాళ్లు అంతాలా చూపించడం, పాపం అమాయక జనాలు ఇక్కడకు వచ్చి అవస్తలు పడడం.

ఏమైనా మన తెలుగు వారికి పాల్స్ ప్రిస్టేజ్ ఎక్కువ. నిండు కుండ తొణకదనుకోండి.

ఇవన్నీ కఠోర వాస్తవాలు, దూరపు కొండలు నునుపు అని పక్కనోడో ఇంకోక్కడో గల్ఫ్ కెళ్లి దండిగా సంపాయించేసారు అని ఉన్న ఊరును, కన్న తల్లిని ఒదిలి వచ్చేముందు ఆలోచించాలి. చెప్పినోడు చెప్పిన దానిలో నిజా నిజాలు ఎంత అని.

Published in: on 04/11/2007 at 2:44 PM  Comments (2)  

సాకలి రెడ్డెన్న సరదా – ఇది నా మొదటి టపా

తెలుగు బ్లాగ్లోకానికి ప్రణామములు. ఈ మద్య చాన్నాళ్లనుంచి నాకు ఏదో బ్లాగాలని మనసు ఉబలాటం ఎక్కువై ఏమి బ్లాగాలొ ఎలా బ్లాగాలొ తెలియక చివరాఖరికి ఈ టపా రాశాను.

కోటకాడ పల్లి చిత్తూరు జిల్లా, యర్రావారి పాలెం మండలం దాటుకొని,  తలకోనకు అడ్డం గా కాకుండా నిలువుగా పోతే వస్తుంది. అదేనండి మా ఊరు. రెండు కి.మి దూరం లొ అడవి ఇంకొ కి.మి. అడుగులేస్తే,  అందమైన సిద్దలగండి రిజర్వాయర్, దాని కింద పండే పచ్చని పొలాలు, వాటికిటువైపు ఉండే పాడాంచెరువు, అందులొ సాకిరేవు, చెరువు మొరవ, మొరవ లొ సంక్రాంతి కి జరిగే సంబరాలు,  ఆవులు బెదిరించే ఘట్టం. అబ్బో ఒకటి కాదండి బాబు సెపితే శానా ఉండాయ్.

ఊరంటే ఉరు కాదండి బాబు, అక్కడ జరిగే సిత్రాలు అన్నీ ఇన్నీ కావు,  సెపితే శానా ………..  కాని కొన్ని, కొన్నే సెప్తా అన్నీ ఇప్పుడే సెప్పితే పోను పోను నా బ్లాగులొ బ్లాగడానికి ఏమి ఉండదు కదా ….ఈ రోజు సాకలి (చాకలి, రజకులు) రెడ్డెన్న సరదా… గురించి సెప్తా..

సాకలి రెడ్డెన్న అంటే మా ఊరోడు కాదు, పక్కూరు, చెంగాడి వాండ్ల పల్లె. మా ఊర్లో చాకలోల్లు, మంగళోల్లు ఇంకా మిగిలిన ఆ రెండూ కులపోల్లు ఉండకూడదంట. ఇది మా ఊర్లొ స్వాతంత్ర్యం రాకముందు నుండి ఉంది.  ఇప్పటికి అట్లే ఉంది.  ఇదో కట్టుబాటు.  ఇప్పటికీ మా ఊర్లొ తగాదాలు,  కొట్లాటలొచ్చినా పులగూరోల్ల రవణ ఇంట్లో పంచాయితీ పెట్టాల్సిందే కాని,  మా ఊరికి ఓ పోలీసోడు కూడా రాడు.
మా ఊరే కాదు చుట్టు పక్కల నాలుగైదు ఊళ్లకి ఆయనే పెద్ద.  అస్సలు ఈ సాకాలోల్ల రెడ్డెన్న ఏంజేశాడంటే,  పులగూరోల్ల రవణ బయటూర్లో పంచాయితీకి పోవడానికి తెస్తానన్న పంచా,  చొక్కా ఇంకా ఉతికి ఇస్త్రీ చేసి తేకుండా రంగన్నా గారి గడ్డలో ఉన్న కూతురింటికి రాజకీయనాయకుడులా తయారయ్యి తిరుగురొడ్డు కాడ బస్సు కోసం కళావతి కొట్లో తాపీగా కాపీ తాగుతూ కూర్చున్నాడు.

పొద్దున్నుండీ చూసిన పులగూరోల్ల రవణ ఇక ఈ రెడ్డిగాడు రాడు అని పక్కింట్లొ ఉన్న బోడిగ్గారి యంకట్రాం కొడుకు జనార్దన్ను సాకలోల్ల రెడ్డెన్న ఇంటికెల్లి పంచ, చొక్క తెమ్మని పురమాయించాడు. ఇందుకోసం తిరుగు రోడ్డు మీదుగా పక్కూరికెలుతున్న జనార్దన కళావతి కొట్లో కాపీ తాగుతున్నా సాకలొళ్ల రెడ్డెన్నను చూసి, “ఒరెయ్ రెడ్డిగా పులగూరోల్లాయన అయ్యగారిపల్లొ మద్దిస్తం (పంచాయితీ) ఉందని నీకు గుడ్డలు తెమ్మని చెప్పినాడంట కదా ఇక్కడ కూర్చుని జమైకాలాడుతున్నవేందీ”? అని రాగం తీసి యాలకోళంగా అడగ్గా, పక్కనున్నోళ్ల దగ్గర పౌరుషం చూపిస్తూ, అవే గుడ్డలు కట్టుకొన్న సాకలొల్ల రెడ్డెన్న “లేదు నేను నా రెండో కూతురు మూడోసారి నీళ్లోసుకుంటోంది,  రంగన్నగారి గడ్డకి పోతాండా, ఈ రోజు ఉద్దోగం,  గిద్దోగం లేదు,  మొన్న తెచ్చిన గుడ్డలు ఇంకా సాకిరేవుకు పోలేదు ఈ రోజుటికి ఏదైనా వేసుకొమ్మనిచెప్పు పొ”  అని బెంచి మీదున్న దుప్పటి లాంటి తుండు గుడ్డని భుజమ్మీదేసుకొని అప్పుడే మలుపు తిప్పుకొని ఆగుతున్న ఏడుసింగల్ బస్సెక్కి చక్కగా పోయాడు.
సాకలి రెడ్డెన్న కోసం వచ్చిన జనార్దన బాట గంగమ్మ కాడ మాడితోపులొ దూరి నేరుగా పులగూరోల్ల రవణ ఇ ంటికెల్లి సాకలి రెడ్డెన్న విషయం చెవిలొ వేసి వరి మళ్లొ నాట్లేయాలని,  చూరుకిందున్న మడక భుజానేసుకొనిపోయాడు. ఇక చేసేదేమి లేక నిన్న పీర్ల పండగ చందాల్లొ మిగిలించుకున్న డబ్బుతొ కొన్న సిల్క్ చొక్కా, మొన్న శ్రీరామ నవమి  తగాద తీర్చడం లొ చిరిగి పోయిన చిన్నంచు పెద్ద పంచెను నడ్డికి చుట్టుకొని గడ్డం దీడుకుంటూ మద్దిస్తానికి పోయాడు పులగూరోల్ల రవణ.
బిడ్డల్లేని వడ్డోళ్ల చిన్నబ్బ,  శివరాత్రికని కొనుక్కొన్న సిల్క్ చొక్కా, జరీ పంచా దీపాలు పెట్టక ముందే తెస్తానన్న సాకలోల్ల రెడ్డెన్న రాకపోయేసరికి తెచ్చుకుందామని చెంగాడి వాండ్ల పల్లె కు చారల చెడ్డితోనె బయలుదేరాడు వడ్డోళ్ల చిన్నబ్బ. మూడేళ్లు  వరసగా శివరాత్రికి తలకోన లొ తలనీలాలు ఇచ్చుకుంటే పండంటి మగ బిడ్డ పుడుతాడని పూజారి సిద్దయ్య సలహా మీద రెండేళ్లు పూర్తి చేసాడు వడ్డోళ్ల చిన్నబ్బ. రాయాల్సిన ప్రోగ్రాం నెట్ లొ దొరికినట్టు ఏడు సింగల్ బస్సు లొ తిరుగురోడ్డు కాడ దిగిన సాకలోల్ల రెడ్డెన్న వడ్డోళ్ల చిన్నబ్బ కు ఎదురు పడ్డాడు. “సందేల దీపాలు పెట్టక ముందే వస్తానన్నోడివి ఏమైపొయావ్ ర రెడ్డిగా”? అని అడగ్గా రెండో కూతురు మూడోసారి నీళ్లొసుకొన్న సంగతి చల్లగా చెప్పి,  తెళ్లారే లోపల మీ ఇంటికాడుంటాయని ప్రమాణం చేసినంత పనిచేసి గండం నుండి బయట పడ్డాడు సాకలోల్ల రెడ్డెన్న.
ఇలానే కొక్కారపు సుబ్రమణ్యం సర్పంచి ఎలెక్షన్ లొ వార్డ్ మెంబర్ గా నిలబడ్డపుడు తెస్తానన్న కద్దరు చొక్కా, ముందు రోజేస్కొని తిరపతెల్లి సమరసిమ్హా రెడ్డి సినిమా మార్నింగ్ షొ మాట్నీ చూసుకొని రాత్రికి రాత్రే ఉతికి ఇస్త్రీ నలక్కుండా ఇచ్చేవాడు సాకలోల్ల రెడ్డెన్న.
మా ఊర్లో ఎవరు కొత్త బట్టలు కొన్న రెండోసారి మాత్రం అది కచ్చితంగా సాకలి రెడ్డెన్న వేసుకోకుండా వదిలేవాడు కాడు. అతని బట్టలు ఎపుడూ నలిగేవి కాదు. అలాగే అతని పనితనం కూడా చాల బావుండేది. అతను చేసిన ఇస్త్రీ కట్టుకున్నా పోయేది కాదు, అంటుకున్న మరక వెతికినా దొరికేది కాదు. ఊర్లో అందరికీ ఈ విషయం తెలియక అలానె ఉన్నారో,  లేక తెలిసీ తెలీనట్టున్నారో,  ఓ పట్టాన అర్థం కాదు

మొత్తమ్మీద నాకర్థం అయిందేంటంటే చాకలొల్ల బట్ట మంగళోల్ల గడ్డం ఎప్పుడూ మాసిపోవు అని.

కొత్త సినిమాలు వచ్చినా, వారపు సంతలు,  జాతరలు వచ్చినా మన రెడ్డెన్నకుండే సరదాయే వేరు. ఇలాంటి పాత్రలు మా ఊళ్లో చాలా ఉన్నాయ్. నా బ్లాగడం బావుందనిపిస్తే మరికొన్ని పరిచయం చేస్తా. …అంతవరకు సెలవ్…చిత్తగించవలెను
ఇక్కడ నాకో సందేహం వచ్చిందండోయ్ ఇపుడు మనమేసుకొంటున్న రెడీమేడు బట్టలు ఇలాంటి వారిని చూసే అందరికీ సరిపొయే కొలతలతో కుడుతున్నారని…ఏమంటారు?
 

Published in: on 29/10/2007 at 7:09 PM  Comments (8)